దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. 100 మందికిపైగా మృతి

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

By అంజి  Published on  12 July 2023 6:15 AM GMT
Heavy rains, India, national news, heavy rain alert

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. 100 మందికిపైగా మృతి

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. భారీ వర్షాల వల్ల హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల భారీగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. వరదలు పొటెత్తుతుండటంతో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సుమారు 300 మందికిపైగా టూరిస్ట్‌లు చిక్కుకుపోయారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో దాదాపు 1,300 రోడ్లు, 40 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఉత్తరాఖండ్ లో గడిచిన 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండలపై నుంచి బండరాళ్లు జారిపడటంతో యాత్రికులు మరణించారు. మరో 13 మంది గాయాలయ్యాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో నదులు, వాగులు, కాలువలు వరదలతో నిండిపోయాయి. తద్వారా మౌలిక సదుపాయాలకు భారీ నష్టం, అవసరమైన సేవలకు అంతరాయం ఏర్పడింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రమాదకర పరిస్థితి నెలకొంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం డేంజర్‌ మార్క్‌ని దాటింది. నది ఒడ్డున ఉండే పలు సమీప లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను సోమవారం రాత్రి ప్రారంభించారు. నదిపైన ఉండే పాత రైల్వే బ్రిడ్జిని మూసేశారు. ఢిల్లీకి వరద పరిస్థితి లేదని మంత్రి సౌరవ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు.

Next Story