పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. శిక్షను త‌గ్గించిన కోర్టు

కర్ణాటక హైకోర్టు పోక్సో చట్టం కేసులో నిందితుడి శిక్షను యావజ్జీవ కారాగార శిక్ష నుండి 10 సంవత్సరాలకు తగ్గించింది. అయితే ఇందుకు సంబంధించి సరైన కారణాలని కోర్ట్ చెప్పింది.

By Medi Samrat  Published on  24 Jun 2024 7:30 AM GMT
పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. శిక్షను త‌గ్గించిన కోర్టు

కర్ణాటక హైకోర్టు పోక్సో చట్టం కేసులో నిందితుడి శిక్షను యావజ్జీవ కారాగార శిక్ష నుండి 10 సంవత్సరాలకు తగ్గించింది. అయితే ఇందుకు సంబంధించి సరైన కారణాలని కోర్ట్ చెప్పింది. నిందితుడు చిక్కమగళూరుకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి. న్యాయమూర్తులు శ్రీనివాస్ హరీష్ కుమార్, సిఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ నిందితుడి అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. అయితే కోర్టు అతడి జరిమానాను రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.

ఈ కేసులో నిందితుడు జూన్ 2016లో తన పొరుగున ఉన్న మైనర్ బాలికతో స్నేహం చేయడంతోపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తె గర్భవతి అని తెలుసుకున్న బాలిక తల్లి డిసెంబర్ 2016లో ఫిర్యాదు చేసింది. డీఎన్‌ఏ పరీక్షలో నిందితుడు బయోలాజికల్ ఫాదర్‌గా నిర్ధారించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ అనంతరం చార్జిషీట్‌ దాఖలు చేశారు.

జూన్ 11, 2018న జిల్లా కేంద్రమైన చిక్కమగళూరు పట్టణంలోని ప్రత్యేక కోర్టు నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద జీవిత ఖైదు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినట్లు నిర్ధారించి రూ. 5,000 జరిమానా విధించింది. అయితే.. బాలిక వయస్సు సరైన పత్రాలతో రుజువు కాలేదని నిందితుడు హైకోర్టులో తీర్పును సవాల్ చేశారు.

విచార‌ణ అనంత‌రం హైకోర్టు.. గరిష్టంగా జీవిత ఖైదు విధించేందుకు ప్రత్యేక కోర్టు తగిన కారణాలను అందించలేదని తేల్చింది. నేరం జరిగిన రోజున ఉన్న చట్టం ప్రకారం.. పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కనిష్టంగా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, గరిష్టంగా జీవిత ఖైదు విధించబడుతుంది. గరిష్ట శిక్షను విధించడానికి సరైన కారణాలు అవసరమని కోర్టు తీర్పు చెప్పింది, ప్రత్యేక కోర్టు తీర్పులో అవి లేవు. పర్యవసానంగా కోర్టు.. శిక్షను 10 సంవత్సరాల జైలు శిక్షగా సవరించింది.

Next Story