కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు పెంచారు. లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు సర్కార్ కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే.. రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ అంశంపై ఆయన మరోసారి స్పందించారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు.
సోమవారం నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా నష్టపోకూడదంటే కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు వెంటనే పిల్లలను కనాలని అన్నారు. గతంలో తానే కొత్త జంటలు పిల్లలను కనేందుకు సమయం తీసుకోవాలని చెప్పాను. కానీ, ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నియోజనకవర్గాలను పునర్విభజించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పిల్లలను కనాలని కోరుతున్నాను. మనం జనాభా పెంచుకోకపోతే నష్టపోతాం. అందుకే కొత్తగా పెళ్లయిన వారంతా వెంటనే పిల్లల్ని కనండి. వారికి తమిళ పేర్లు పెట్టాలని కోరారు. మరోవైపు, ఇదే అంశంపై చర్చ కోసం ఎంకె స్టాలిన్ మార్చి 5న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నారు.