రైలులో పేలుడు.. మంటలు చెలరేగి నలుగురికి తీవ్రగాయాలు
హర్యానాలోని రోహ్‌తక్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 28 Oct 2024 9:15 PM ISTహర్యానాలోని రోహ్‌తక్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. సంప్లా సమీపంలో రైలు బోగీలో పేలుడు సంభవించిందని చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నలుగురు ప్రయాణికులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సమాచారం అందుకున్న స్థానిక, రైల్వే పోలీసులు వచ్చి పరిశీలించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనా స్థలం నుంచి ఆధారాలను కూడా సేకరించింది. సల్ఫర్, పొటాష్‌ను ఎవరో తీసుకెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీని కారణంగా పేలుడు సంభవించింది. రైల్వే పోలీసులు బాంబు నిర్వీర్య బృందాన్ని కూడా విచారణ కోసం పిలిచారు.
ఢిల్లీ నుంచి ఒక బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. సాయంత్రం 4:30 గంటలకు రోహ్‌తక్ రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరింది. సంప్లా స్టేషన్ దాటిన వెంటనే బోగీలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా నలుగురు ప్రయాణికులకు కాలిన గాయలయ్యాయి. డ్రైవర్ వెంటనే రైలును ఆపి స్టేషన్ మాస్టర్‌కు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే సంప్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇంతలో రోహ్తక్ నుండి RPF బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి అన్ని బృందాలు కూడా ప్రయాణికులను విచారించాయి.
విచారణలో ఓ ప్రయాణికుడి వెంట సల్ఫర్, పొటాష్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి మంటలు చెలరేగాయి. పేలుడు తర్వాత రైలు చాలా సేపు ట్రాక్‌పై నిలిచిపోయింది. విచారణ అనంతరం ప్యాసింజర్ రైలును ఢిల్లీకి పంపించారు. ఈ కేసును సీరియస్‌గా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగిన కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రయాణికులు తమ సీట్లపై కూర్చున్నట్లు చెప్పారు. సీట్ల పైన ఉన్న లగేజీ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.