5వ తరగతి వరకు పాఠశాలలు బంద్ చేయండి.. ప్రభుత్వం ఆదేశాలు
హర్యానాలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నయాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
By Medi Samrat Published on 16 Nov 2024 6:28 PM ISTహర్యానాలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నయాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. 5వ తరగతి వరకు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది.
ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో తీవ్రమైన కాలుష్యం దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని (GRAP ప్రకారం) సంబంధిత డిప్యూటీ కమిషనర్ అంచనా వేయాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. పిల్లల భద్రత దృష్ట్యా, పాఠశాలల్లో (ప్రభుత్వ మరియు ప్రైవేట్) 5వ తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయండని జారీ చేసిన సర్క్యులర్‌లో కోరింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పొగమంచు కమ్ముకుంటుంది. ఐదు రోజులుగా పొగలు కమ్ముకుంటున్నాయి. ఢిల్లీ ఏక్యూఐ 396కి చేరుకోగా.. హర్యానాలోని ఎనిమిది నగరాల ఏక్యూఐ అధ్వాన్నంగా ఉంది. భివానీ రాష్ట్రంలోనే అత్యంత కలుషిత ప్రాంతంగా నిలిచింది. రెండు రోజుల క్రితం కూడా ఈ నగరంలో గాలి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న పొగమంచుతో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి.
హర్యానాలోని భివానీతో పాటు, బహదూర్‌గఢ్, సోనిపట్, జింద్, రోహ్‌తక్, కైతాల్, కర్నాల్, గురుగ్రామ్‌లలో గాలి అధ్వాన్నంగా ఉండగా.. 10 నగరాల AQI 200 నుండి 300 మధ్యకు చేరుకుంది. ఈ నగరాల్లో ఎల్లో స్మోగ్ అలర్ట్: కురుక్షేత్ర, కైతాల్, కర్నాల్, రోహ్‌తక్, సోనిపట్, పానిపట్, సిర్సా, ఫతేహాబాద్, హిసార్, జింద్, భివానీ ఉన్నాయి.
కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా, ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని, ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులను నడుపుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.