హర్యానా మంత్రివర్గ విస్తరణ.. కొత్త‌గా 8 మందికి ఛాన్స్‌

హర్యానాలోని నయాబ్‌ సింగ్ సైనీ ప్రభుత్వ కొత్త‌ మంత్రివర్గం కొలువుదీరింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat  Published on  19 March 2024 6:31 PM IST
హర్యానా మంత్రివర్గ విస్తరణ.. కొత్త‌గా 8 మందికి ఛాన్స్‌

హర్యానాలోని నయాబ్‌ సింగ్ సైనీ ప్రభుత్వ కొత్త‌ మంత్రివర్గం కొలువుదీరింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒకరికి కేబినెట్ మంత్రిగా, మిగిలిన ఏడుగురికి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. సోహ్నా ఎమ్మెల్యే సంజయ్ సింగ్, ఎమ్మెల్యే విషంభర్ వాల్మీకి, సుభాష్ సుధా, అభయ్ యాదవ్, అసీమ్ గోయల్, మహిపాల్ ధండా, బద్ఖల్ ఎమ్మెల్యే సీమా త్రిఖా, డాక్టర్ కమల్ గుప్తా మంత్రులుగా ప్రమాణం చేశారు.

అయితే.. ఇప్పటికే ఐదుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కన్వర్పాల్ గుర్జర్, మూల్‌చంద్ శర్మ, రంజిత్ సింగ్, JP దలాల్, డాక్టర్ బన్వారీ లాల్ ఉన్నారు. తొలుత లోక్‌సభ ఎన్నికల తర్వాత సైనీ ప్రభుత్వ కేబినెట్‌ను విస్తరించాలని భావించినప్పటికీ, కేబినెట్‌లో కుల, ప్రాంతీయ సమతుల్యత నెలకొల్పిన తర్వాతే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రవేశించాలని నిర్ణయించినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎం ఓబీసీ, ఇద్దరు జాట్‌లు, ఎస్సీ, గుర్జర్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున మంత్రులు ఉన్నారు. పంజాబీ, రాజ్‌పుత్‌, వైశ్య, యాదవ్‌ వర్గాలకు చెందిన మంత్రులు లేరు. అందుకే ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story