పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (PAAS) కన్వీనర్, కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ మే 30 లేదా మే 31 న గాంధీనగర్‌లో బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో ఆయన ఈ మేరకు సూచనను చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై వ్యాఖ్యానించారు.
ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన కార్యక్రమంలో పటేల్ తాను బీజేపీలో చేరుతున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని సూచించాడు. సోమనాథ్ ఆలయం నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఏక్తా యాత్రకు నాయకత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హార్దిక్ పటేల్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో భారీ ప్రదర్శన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
బీజేపీలో ఎలా చేరాలనుకుంటున్నారు అనే దానిపై హార్దిక్ కు రెండు, మూడు ఆప్షన్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో లేదా గుజరాత్ బీజేపీ ఇన్‌ఛార్జ్ భూపేందర్ యాదవ్ లేదా గాంధీనగర్‌లో బి.ఎల్. సంతోష్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. హార్దిక్ మే 18న కాంగ్రెస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. హార్దిక్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటిస్తానని మీడియాతో చెప్పాడు.