సూరత్‌కు చెందిన 37 సంవత్సరాల జర్నలిస్ట్ ను అతి దారుణంగా హతమార్చారు. భార్య, ముగ్గురు కుమార్తెల కళ్ల ముందు ఈ హత్య చోటు చేసుకుంది. జునేద్ పఠాన్ అనే జర్నలిస్టు మోటార్‌సైకిల్ ను నలుగురు వ్యక్తులు మొదట తమ కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో దాడి చేసి హతమార్చారు. పఠాన్ భార్య, పది, నాలుగు, రెండున్నరేళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలతో కలిసి షాపూర్ వాడ్‌లోని బంధువులను కలవడానికి వెళ్తున్నాడు. రద్దీగా ఉండే జిలానీ బ్రిడ్జి దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టడంతో కుటుంబం రోడ్డు పైన కింద పడింది. నలుగురు వ్యక్తులు వెంటనే కారు దిగి పఠాన్‌ను వెనుక భాగంలో కత్తితో పొడిచారు.
సూరత్ లో హత్య ఘటనలు తగ్గాయని.. ఏసీపీ (సెక్టార్ 2, ట్రాఫిక్ అండ్ క్రైమ్) శరద్ సింఘాల్ విలేకరులతో చెప్పిన ఒక రోజు తర్వాత ఈ హత్య చోటు చేసుకుంది. నగరంలో హత్యలు తగ్గుముఖం పట్టాయని శరద్ సింఘాల్ చెప్పిన వ్యాఖ్యలు అవాస్తవమని సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. "జనవరి 2022లో, సూరత్ నగరంలో కేవలం రెండు హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి, జనవరి 2021లో 12 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో, ఆరు హత్య నేరాలు నమోదయ్యాయి," అని శరద్ సింఘాల్ చెప్పారు. గత ఒకటిన్నర నెలల్లో నమోదైన మొత్తం ఎనిమిది కేసులను చేధించామని, నిందితులను పట్టుకున్నామని సింఘాల్ చెప్పారు. వీటిలో ఆరు వ్యక్తిగత శత్రుత్వం, కుటుంబ వివాదాల వల్ల చోటు చేసుకున్నవని తెలిపారు.