మరో బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా.. ఈసారి..!

Gujarat chief minister Vijay Rupani resigns. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను

By Medi Samrat
Published on : 11 Sept 2021 4:03 PM IST

మరో బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా.. ఈసారి..!

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కొద్దిసేపటి కిందట గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికిప్పుడు విజయ్ రూపానీ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని విజయ్ రూపానీ తెలిపారు. ఇది సాధారణంగా భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకునేదే అని తెలిపారు.

భారతీయ జనతా పార్టీలోనే ఉండి పార్టీ ఎదుగుదల కోసం పని చేస్తానని తెలిపారు. తాను ఇప్పటికే అయిదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని.. అందుకు తనకు చాలా గర్వంగా కూడా ఉందని తెలిపారు. కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తూ వెళుతోందని అన్నారు. ప్రజలకు బీజేపీ మీద గట్టి నమ్మకం ఉందని ఆయన తెలిపారు. 2016 నుంచి విజయ్‌ రూపానీ గుజరాత్‌ సీఎంగా కొనసాగుతున్నారు. ఏబీవీపీ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగారు. రూపానీ 1998లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2006-12 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.


Next Story