అక్టోబర్ నెలలోనూ భారీగా జీఎస్టీ వసూళ్లు
GST revenue for October 2021. అక్టోబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
By Medi Samrat Published on 1 Nov 2021 9:25 PM ISTఅక్టోబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. అక్టోబరులో జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.1,30,127 కోట్లు అని వివరించింది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇవి రెండో అత్యధిక వసూళ్లు అని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ.1.41 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్రం వివరించింది. అక్టోబరు మాసానికి సంబంధించి కేంద్ర జీఎస్టీ రూ.23,861 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,421 కోట్లు అని తెలిపింది. సమీకృత జీఎస్టీ రూ.67,361 కోట్లు కాగా, సెస్ రూపేణా రూ.8,484 కోట్లు వసూలు అయినట్టు వివరించింది. జీఎస్టీ లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా నాలుగో సారి. ఆర్థిక పునరుద్ధరణతో పాటు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడి పెరుగుతున్న ఈ-పే బిల్లుల ధోరణికి ఈ వసూళ్లు దోహదపడుతున్నాయని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉన్నాయి.
జీఎస్‌టీ వసూళ్లలో కేంద్ర వాటా రూ.23,861 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ వాటా రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,998 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.699 కోట్లతో సహా). ఈ సమ్మిళిత జీఎస్‌టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువగా ఉంది.