వాటిపై జీఎస్టీ భారీగా తగ్గింపు
GST Council Meeting updates. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నేడు జీఎస్టీ మండలి సమావేశం జరిగింది
By Medi Samrat Published on 12 Jun 2021 8:13 PM ISTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నేడు జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆయా రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు. కోవిడ్-19 వ్యాక్సిన్, ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను రద్దు లేదా పన్ను రేటు తగ్గించాలని పలు రాష్ట్రాలు జీఎస్టీ భేటీలో కేంద్రాన్ని కోరాయి. జీఎస్టీ మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే మూడు మందులకు, టెస్టింగ్ కిట్స్‌కు పన్ను మినహాయింపు ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌పై మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. కరోనా మందులు, చికిత్సకు వాడే పరికరాలపై పన్ను తగ్గించారు.
అంబులెన్స్ సేవలపై 28 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు. టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్ ఔషధంపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గించారు. ఆక్సిజన్ యూనిట్లు, ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, ఇతర సంబంధిత పరికారాలపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గించారు. కోవిడ్ టెస్ట్ కిట్లు, యంత్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఉష్ణోగ్రతలు లెక్కించే పరికరాలు, శానిటైజర్లపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ జీఎస్టీ తగ్గింపులు, మినహాయింపులు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.