మా ఇంట్లో 12 మంది.. నాకు వచ్చింది ఒకే ఒక్క ఓటు సార్..!

Gram Panchayat Election Results In Gujarat. గుజరాత్‌లోని గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.

By Medi Samrat  Published on  22 Dec 2021 6:04 PM IST
మా ఇంట్లో 12 మంది.. నాకు వచ్చింది ఒకే ఒక్క ఓటు సార్..!

గుజరాత్‌లోని గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. మొత్తం 8686 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అన్ని గ్రామాల్లోనూ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగాయి. దాదాపు 77 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లోని వాపిలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ అభ్యర్థి పేరు సంతోష్‌భాయ్ హల్పాటి కాగా అతడికి ఒకే ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అతడి కుటుంబంలో 12 మంది ఉన్నారు.. వారు ఓటు వేసినా ఆ అభ్యర్థికి 12 ఓట్లు పడాలి. అయితే ఒక్క ఓటు మాత్రమే రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కుటుంబ సభ్యులు కూడా తనకు ఓటు వేయకపోవడంతో సంతోష్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఫలితాలు విన్న తర్వాత, అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంట్లో సభ్యులు అతడికి మద్దతు ఇవ్వకపోవడంతో చాలా బాధపడ్డాడు. అందుకే ఎన్నికల్లో సంతోష్ కు వచ్చిన ఓటు గ్రామంలో చర్చనీయాంశమైంది.

ఛార్వాలా గ్రామంలో సంతోష్‌ కుటుంబంలో మొత్తం 12 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ ఎన్నికల పోటీలో సంతోష్‌ ప్రధాన అభ్యర్థి కాదు. కానీ పోటీ చేయాలనుకున్నాడు. కనీసం తన కుటుంబసభ్యుల ఓట్లయినా వస్తాయని నమ్మాడు సంతోష్. కౌటింగ్‌ చేయగా సంతోష్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు పడినట్లుగా తేలింది. దీంతో సంతోష్ షాకయ్యాడు. కనీసం మా ఇంట్లోవారు కూడా నాకు ఓటు వేయలేదా?అని ఆశ్చర్యపోయాడు. ఆ వచ్చిన ఓటు కూడా ఆయన వేసుకున్నదే అని తేలింది. దీంతో సంతోష్ గట్టిగా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏడ్చడం పలువురిని బాధ పెట్టింది. ఏది ఏమైనా ఇప్పుడు సంతోష్ నేషనల్ లెవెల్ సెలెబ్రిటీ అయిపోయాడు.


Next Story