వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 50 శాతం కేటాయింపులకు అదనంగా మరో 20 శాతం సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ అదనపు 20 శాతం కోటా పొందాలంటే వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు తమ నగరాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల వద్ద పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. సిలిండర్ల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు చూసుకోనున్నాయి.