రైతుల ఆదాయం పెంచడం కోసమే నూతన చట్టాలు : ప‌్రధాని మోదీ
Govt committed to helping farmers through its reforms. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తోన్న ఉద్యమానికి
By Medi Samrat Published on 12 Dec 2020 4:58 PM ISTనూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తోన్న ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరుకుంది. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. కాగా.. నూతనంగా వచ్చిన రైతు చట్టాల గురించి అన్నదాతలకు వివరించే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. వాటిని తీసుకురావడానికి గల ఆవశ్యకతను, వాటి వల్ల కలిగే లాభాలను తెలియజేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సంస్కరణలతో వ్యవసాయ రంగంలో అధికంగా పెట్టుబడులు వస్తాయని, రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కొత్త చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు ప్రత్నామ్నాయాలను అందిపుచ్చుకోనున్నారన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తుల్ని వారి ఇష్టం మేరకు మండీల్లో లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో శీతల గిడ్డంగులను ఆధునికీకరించనున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయన్నారు. దీంతో రైతులకు లబ్దిచేకూరనుందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామన్నారు. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.