LPG సరఫరాపై ఆందోళన వద్దు..వినియోగదారులకు కేంద్రం భరోసా

ఎల్‌పీజీ (LPG) సరఫరాలో కొంత క్లిష్టత ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

By -  Knakam Karthik
Published on : 16 March 2026 7:20 PM IST

National News, Delhi, LPG Supply, Central Government, PNG Connection, Petroleum Ministry

LPG సరఫరాపై ఆందోళన వద్దు..వినియోగదారులకు కేంద్రం భరోసా

ఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ (LPG) సరఫరాలో కొంత క్లిష్టత ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దేశవ్యాప్తంగా గ్యాస్ పంపిణీ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ సోమవారం వెల్లడించారు.

ఈ క్లిష్ట సమయంలో ఎల్‌పీజీ నిల్వలు పెంచుకోవడం (హోర్డింగ్), బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు వినియోగదారులు పైపుల వంట గ్యాస్ (PNG) వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఐజీఎల్ (IGL), మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉచిత గ్యాస్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మాఫీ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించాయని ఆమె వివరించారు.

ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎల్‌పీజీ కొరత లేదని, డీలర్ల వద్ద నిల్వలు నిండుకున్నట్లు (డ్రై-అవుట్) ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. మార్చి 13న గరిష్టంగా 88.8 లక్షల రీఫిల్ బుకింగ్‌లు నమోదవగా, మార్చి 15 నాటికి అవి 50-55 లక్షలకు తగ్గాయని, అయితే ఇది కేవలం ఆదివారం సెలవు వల్ల జరిగిన మార్పు కావచ్చని అభిప్రాయపడ్డారు.

డిజిటల్ బుకింగ్‌ల వాటా 90 శాతానికి పెరగడం సానుకూల పరిణామమని, వినియోగదారులు క్యూలలో నిలబడకుండా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అక్రమాలను అరికట్టేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, సుమారు 1,100 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కడైతే పైప్‌లైన్ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో, అక్కడ వినియోగదారులు వెంటనే పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకోవాలని అధికారులు కోరారు.

Next Story