భారత్ లో సెకండ్ వేవ్ కు కారణం 'ఇండియన్ వేరియంట్' అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడా కూడా ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని ఉపయోగించలేదు. అయితే సోషల్ మీడియాలో ఇండియన్ వేరియంట్ అంటూ ఉన్న కథనాలను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. ఇండియన్ వేరియంట్ అంటూ కంటెంట్‌తో కూడిన కథనాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాల్సిందిగా సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. B.1.617 కారణంగా కరోనా కేసులు ఎక్కువయ్యాయని అన్నారు కానీ.. 'ఇండియన్ వేరియంట్' ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని కేంద్రం వెల్లడించింది.
ఇకపై ఏ సోషల్ మీడియా వేదికలోనూ భారత వేరియంట్ అనే పదం కనిపించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. భారత వేరియంట్ అనే పదంతో కూడిన కంటెంట్ ఏ మాధ్యమంలో ఉన్నా తొలగించాల్సిందేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. బి.1.617 వేరియంట్.. భారత వేరియంట్ అనే పేరుతో ఇది విపరీతమైన ప్రాచుర్యంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తుండడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను భారత వేరియంట్ అని పేర్కొనడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది.