కుంభమేళాకు వెళ్లడం ఇక‌ సులభం.. ఫ్లైట్‌లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థ‌లు

ప్రయాగ్‌రాజ్‌కి విమాన ఛార్జీలు స్థిరంగా ఉన్నాయని, మహాకుంభం కోసం ఈ మార్గంలో విమానాల సంఖ్యను 900కు పెంచామని ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం తెలిపింది.

By Medi Samrat  Published on  31 Jan 2025 7:33 AM IST
కుంభమేళాకు వెళ్లడం ఇక‌ సులభం.. ఫ్లైట్‌లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థ‌లు

ప్రయాగ్‌రాజ్‌కి విమాన ఛార్జీలు స్థిరంగా ఉన్నాయని, మహాకుంభం కోసం ఈ మార్గంలో విమానాల సంఖ్యను 900కు పెంచామని ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం తెలిపింది. ప్రయాణీకుల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ప్రయాగ్‌రాజ్‌కు విమానాలలో ఛార్జీల పెంపుపై నిరంతర ఫిర్యాదులు అందుతున్నాయి.

టిక్కెట్ ధరలను స్థిరంగా ఉంచుతూ ఈ మార్గంలో మరిన్ని విమానాలను నడపాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను కోరింది. ఇండిగో విమానయాన సంస్థ ఛార్జీలు స్థిరంగా ఉండేలా చూసుకుందని.. త‌మ‌ వినియోగదారులందరికీ ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఇండిగో కట్టుబడి ఉందని చెప్పారు.

బుధవారం, ఇండిగో ప్రయాగ్‌రాజ్ విమానాల ఛార్జీలను 30-50 శాతం తగ్గించినట్లు వర్గాలు తెలిపాయి. ఇండిగో సంస్థ ప్రకారం.. మహా కుంభ్ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుండి విమానాల సంఖ్య, సీట్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.

ఇండిగో భారతదేశంలోని 10 ప్రాంతాలనుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమానాల‌ను న‌డుపుతున్న‌ట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, రాయ్‌పూర్, భువనేశ్వర్‌లను ఇప్పటికే విమానాలు న‌డుస్తుండ‌గా.. అదనంగా అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్‌ల‌ నుంచి కూడా విమాన స‌ర్వీసులు ప్రారంభించింది.

అకాసా ఎయిర్ కూడా ప్రయాగ్‌రాజ్‌కి విమాన ఛార్జీలను 30-45 శాతం తగ్గించింది. అకాసా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమానాల సంఖ్యను కూడా పెంచింది. పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక విమానాలను ప్రారంభించినట్లు అకాసా ఎయిర్ తెలిపింది. అంత‌కుముందు ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌లు న‌డిపింది.

మహాకుంభం వద్ద తొక్కిసలాట దృష్ట్యా, జాతర ప్రాంతంలో భక్తుల భద్రత కోసం ఇప్పుడు కొత్త ప్రణాళికలు అమలు చేయనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అదనపు భద్రతా బలగాలను మోహరిస్తున్నారు.

Next Story