స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయాల్లో ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించకుండా చూడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలను కూడా నిర్వహించాలని కోరింది. జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీకగా ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్‌తో కాకుండా పేపర్‌తో తయారు చేసిన జెండాలను వాడాలని చెప్పింది. పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా, మానవాళి భవిష్యత్తుకు భరోసా కలిగించేందుకు ప్లాస్టిక్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఆ కారణంగా భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ పదార్థంతో జెండాను తయారు చేయవద్దని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కోరింది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల సందర్భాల్లో దేశ గౌరవాన్ని ప్రపంచానికి ఇనుమడింప చేసే సమయాల్లోనూ ప్లాస్టిక్ తో తయారైన జాతీయ జెండాను వాడవద్దని తెలిపింది. దేశానికి చిహ్నమైన జాతీయ జెండాను అవమానించేలా రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో పారవేయరాదని, వ్యక్తిగత సమయంలో మాత్రమే దాన్ని డిస్మిస్ చేయాలని, ఈ మేరకు భారత జాతీయ జెండా చట్టం 2002 ప్రకారం నడుచుకోవాలని తెలిపింది. భూమిలో కలిసిపోయే పేపర్ తో తయారైన జాతీయ జెండాను వినియోగించాలని పేర్కొంది.