తప్పు జరిగింది.. కన్నడిగులకు సారీ చెప్పిన గూగుల్
Google apologises after showing Kannada as ‘ugliest language’. కొన్ని కొన్ని సార్లు గూగుల్ చూపించే సమాధానాలు ఎంతో కోపం
By Medi Samrat Published on 4 Jun 2021 1:12 PM ISTకొన్ని కొన్ని సార్లు గూగుల్ చూపించే సమాధానాలు ఎంతో కోపం తెప్పిస్తూ ఉంటాయి. ఎవరో ఏదో రాసుంటే.. దాన్నే ప్రామాణికంగా చేసుకుని సమాధానంగా చూపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో గూగుల్ సంస్థ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా గూగుల్ లో 'అగ్లీయెస్ట్ లాంగ్వేజ్' అంటే ఏమిటి అని అడగ్గా.. 'కన్నడ' అని చూపించింది. ఇక ఈ సమాధానం కన్నడిగులకు తీవ్ర కోపం తెప్పించడంతో పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో గూగుల్ పై విమర్శలు మొదలుపెట్టారు.
భారతదేశంలో వికారమైన భాష ఏమిటి? అనే ప్రశ్నకు గూగుల్ సమాధానం కన్నడ అని ఉంది. దక్షిణ భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది మాట్లాడే భాష కన్నడ. ఇలా ఓ గొప్ప చరిత్రకలిగిన భాషను వికారమైన భాషగా చెప్పడం ఎవరికీ నచ్చలేదు. దీనిపై కన్నడ ప్రజలు, రాజకీయ ప్రతినిధులు మండిపడ్డారు. విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉందని.. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కూడా ఒకటని పలువురు తెలిపారు.
విషయం గూగుల్ దాకా వెళ్లడంతో.. జరిగిన తప్పిదానికి, కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు గూగుల్ క్షమాపణలు తెలియజేసింది. అదే సమయంలో నిజానికి ఈ అభిప్రాయాలు గూగుల్‌కు సంబంధం లేనివి అని వివరణ ఇచ్చింది. 'సెర్చ్ రిజల్ట్స్ ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండవు. కొన్నిసార్లు, కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలకు ఇంటర్నెట్‌లో ఆ కంటెంట్ వివరించబడిన విధానం ఆశ్చర్యకర రీతిలో ఉంటుందని' గూగుల్ తెలిపింది. ఇది సరైనది కాదని మాకు తెలుసు.. అందుకే సమస్య గురించి తెలియగానే దిద్దుబాటు చర్యలకు దిగుతామని.. సంబంధిత అల్గారిథంను మెరుగుపరిచేందుకు నిరంతరం పనిచేస్తుంటామని గూగుల్ వివరించింది. నిజానికి సెర్చ్ రిజల్ట్స్‌లో చూపించే కంటెంట్ గూగుల్ అభిప్రాయం కిందకు రాదని.. ఏదేమైనా జరిగిన అపార్థానికి,ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నామని గూగుల్ తెలిపింది.