అన్నదాతలకు ఐఎండీ తీపికబురు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
భారత వాతావరణ కేంద్రం అన్నదాతలకు తీపికబురు చెప్పింది.
By Knakam Karthik
అన్నదాతలకు ఐఎండీ తీపికబురు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
భారత వాతావరణ కేంద్రం అన్నదాతలకు తీపికబురు చెప్పింది. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. 2025 ఏడాదికి దీర్ఘకాల వర్షపాత నమోదు వివరాలను కూడా భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కారణంగా దేశ వ్యాప్తంగా మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
నైరుతి రుతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. 1971-2020 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా సీజన్ వర్షపాత దీర్ఘకాల సగటు 87 సెంటిమీటర్లు నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.