గోవాలో లాక్ డౌన్.. కఠిన ఆంక్షలు..!
Goa weekend lockdown. భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 1 May 2021 5:42 PM ISTభారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇన్ని రోజులూ మూడు లక్షల కేసులకు పైగా నమోదవ్వగా.. తాజాగా నాలుగు లక్షల కేసుల మార్కును తగిలింది. భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 2,99,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 3,523 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో మృతుల సంఖ్య 2,11,853 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,56,84,406 మంది కోలుకున్నారు. 32,68,710 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
కరోనా కేసులను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తూ ఉన్నాయి. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో అధికారులు లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 50 శాతాన్ని మించడంతో గోవా ప్రభుత్వం నాలుగు రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలెవరూ బయటకు రావద్దని సూచిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 16 లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతుండంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. వీక్లీ మార్కెట్లు కూడా అందుబాటులో ఉండబోవని.. అత్యవసర విభాగాలన్నీ యథావిధిగా పని చేస్తాయని అధికారులు తెలిపారు.