భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై దాడి చేసి, ప్రజలను అగౌరవపరిచిన ఆక్రమణదారులను సమర్థించడం దేశద్రోహ చర్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపుపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి నుండి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
బహ్రాయిచ్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ, "ఆక్రమణదారులను కీర్తించడం అంటే దేశద్రోహ మూలాలను బలోపేతం చేయడమే. మన గొప్ప పూర్వీకులను అవమానించే వారిని, మన నాగరికతపై దాడి చేసిన వారిని, మన మహిళలపై దారుణాలు చేసిన వారిని, మన విశ్వాసాన్ని దెబ్బతీసిన వారిని ప్రశంసించే వారిని సరికొత్త భారతదేశం ఎప్పటికీ అంగీకరించదు" అని అన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచం గుర్తించే సమయంలో, మన గుర్తింపును తొలగించడానికి ప్రయత్నించిన వారిని ప్రశంసించడం కరెక్ట్ కాదన్నారు. మన విశిష్ట నాయకులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు.