గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన జిమ్ ట్రైనర్

Ghaziabad Gym Trainer Dies Of Heart Attack While Sitting On Chair. గుండెపోటు కారణంగా కుర్చీపై కూర్చొని ఓ వ్యక్తి కుప్పకూలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By Medi Samrat
Published on : 19 Oct 2022 9:15 PM IST

గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన జిమ్ ట్రైనర్

గుండెపోటు కారణంగా కుర్చీపై కూర్చొని ఓ వ్యక్తి కుప్పకూలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. జిమ్ ట్రైనర్ నిమిషాల్లోనే ప్రాణాలను కోల్పోయిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆదివారం రాత్రి 7 గంటలకు ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. ఆదిల్ అనే వ్యక్తి జిమ్ ట్రైనర్.. అతని వయస్సు 33 సంవత్సరాలు. అతని సహాయకులు ఆదిల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అతను మార్గమధ్యంలో మరణించాడు. అతను ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో జిమ్ న‌డుపుతున్నాడు. ప్రతి రోజూ వ్యాయామం చేసేవాడు. అతడు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా జిమ్‌కు వెళ్లడం మానలేదని ఆదిల్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదిల్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. అతని కుటుంబం ఈ సంఘటనతో షాక్‌లో ఉంది.

అతడు ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగి.. ఘటన జరిగిన షాలిమార్‌ గార్డెన్‌లో కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఆదిల్ తన కార్యాలయంలో కూర్చొని ఉండగా గుండెపోటుకు గురయ్యాడు. ముంబైలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా ఆడుతున్న 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించిన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరిగింది. గత నెలలో, జమ్మూలో ఒక కళాకారుడు తన ప్రదర్శన మధ్యలో స్టేజ్‌పై కుప్పకూలి మరణించాడు. జమ్మూలోని బిష్నా ప్రాంతంలో గణేష్ ఉత్సవ్‌లో పార్వతీ దేవి వేషంలో యోగేష్ గుప్తా ప్రదర్శన ఇస్తూ ఉండగా కన్నుమూశాడు.


Next Story