ఆర్మీ కొత్త చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు జనరల్ మనోజ్ పాండే ఆర్మీ ఉప చీఫ్ గా పనిచేశారు. ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనకు పదోన్నతి దక్కింది. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతలను నిర్వహించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారిగా జనరల్ పాండే నిలిచారు.
జనరల్ పాండే భారత సైన్యానికి 29వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆయన చదువుకున్నారు. బ్రిటన్‌లోని కంబెర్లీ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. హయ్యర్ కమాండ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులు చేశారు. 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ (బాంబే సాపర్స్)లో చేరారు. భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో 2001-02లో భారత్-పాక్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన సమయంలో ఆపరేషన్ పరాక్రమ్‌లో జనరల్ పాండే విధులు నిర్వహించారు. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ అయిన తొలి అధికారిగా జనరల్ మనోజ్ పాండే చరిత్ర సృష్టించారు. గతంలో ఈ విభాగం నుంచి వైస్ చీఫ్ స్థానం వరకే రాగలిగారు. 62 ఏళ్ల వరకు లేదంటే మూడేళ్లు ఈ రెండింటిలో ఏది ముందే అయితే అప్పుటి వరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం ప్రకటించింది.