ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పై మరో రూ. 25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీయేతర సిలిండర్ పై ఈ భారం పడనుంది. తాజాగా పెరిగిన ధర ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ రూ. 859.5కు చేరుకుంది. ముంబైలో సిలిండర్ ధర రూ.859.5కు పెరిగగా.. కోల్‌కతాలో రూ. 886కి చేరింది. ఇక చెన్నైలో సిలిండర్ ధర రూ. 875.50కి చేరగా.. లక్నోలో రూ .897.5, అహ్మదాబాద్‌లో రూ. 866.50కు పెరిగింది.
ఇక తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరం హైదరాబాద్‌లో రూ.887గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. ఇప్పుడు 25 రూపాయలు పెరగడంతో రూ.912కి చేరింది. ప్రస్తుతం పెరిగిన రూ.25తో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ సిలిండర్ పై ఏకంగా రూ. 80.50 మేర పెరిగిపోయింది. ఇప్పటికే పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా అన్నింటిపై ప్రభావం చూపుతుండగా.. మరోవైపు గ్యాస్ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి.