సామాన్యుల నెత్తిపై మరో పిడుగు.. గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు
Gas Cylinder Price Hike. సామాన్యుల నెత్తిపై మరో పిడుగు పిడింది. ఓవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ
By Medi Samrat Published on 15 Dec 2020 7:04 AM GMTసామాన్యుల నెత్తిపై మరో పిడుగు పిడింది. ఓవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ.. అంతర్జాతీయంగా చమురు ధరలకు అనుగుణంగా దేశంలో రాయితీ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి చమురు సంస్థలు. ఒక్కో సబ్సిడీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండో సారి.
డిసెంబర్ 2న ఒక్కో గ్యాస్ సిలిండర్ పై 50 పెంచిన చమురు సంస్థలు.. మంగళవారం మరో రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి.
15 రోజుల వ్యవధిలో రూ.100 పెరగడంతో సామాన్యుల నెత్తిన పిడుగుపాటు పడినటైంది. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.644గా ఉన్న సబ్బిడీ సిలిండర్ ధర రూ.694కు పెరిగింది. హైదరాబాద్‌లో రూ.686.50 పైసలు ఉండగా.. ఇప్పుడు 50 రూపాయలు పెరగడంతో సిలిండర్ ధర 736 రూపాయల 50 పైసలకు చేరుకోనుంది. గ్యాస్ సిలిండర్ ధరలు..ఆయా ప్రాంతాలను బట్టి.. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు బట్టి అదనంగా వసూలు చేస్తారు. ఇక 5 కేజీల సిలిండర్‌పై రూ.18, 19 కేజీల సిలిండర్ పై రూ.36.50పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.
గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై రాయితీ అందిస్తోంది. వినియోగదారులు సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరలకు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ సబ్సీడి మొత్తాన్ని కేంద్రం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ గ్యాస్ ధరను పెంచడంతో పేద ప్రజలు, సామాన్యులు ఎవరైతే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారో వారు అదనంగా డబ్బును వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది.