స్వలింగ సంపర్కుల వలె నటించి ర‌మ్మంటారు.. వెళ్ల‌గానే..

LGBTQ+ కమ్యూనిటీకి సంబంధించిన అతిపెద్ద డేటింగ్ యాప్ Grindr ను ఉపయోగించి ఆయా వ్యక్తులను ఓ ప్రాంతానికి రమ్మని చెప్పి, అక్కడకు రాగానే దోపిడీ చేస్తున్న నలుగురు దుండగుల బృందాన్ని పూణే పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  28 Jan 2025 4:59 PM IST
స్వలింగ సంపర్కుల వలె నటించి ర‌మ్మంటారు.. వెళ్ల‌గానే..

LGBTQ+ కమ్యూనిటీకి సంబంధించిన అతిపెద్ద డేటింగ్ యాప్ Grindr ను ఉపయోగించి ఆయా వ్యక్తులను ఓ ప్రాంతానికి రమ్మని చెప్పి, అక్కడకు రాగానే దోపిడీ చేస్తున్న నలుగురు దుండగుల బృందాన్ని పూణే పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ అనేక మంది వ్యక్తుల నుండి నగదు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఇలాంటి చీటింగ్ కేసులు కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ తమ గురించి బయటకు తెలిసిపోతుందని భావించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.

నాందేడ్ సిటీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లో స్వలింగ సంపర్కుల వలె నటించి, పదునైన ఆయుధాలతో బెదిరించి స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని ధైరీకి చెందిన భరత్ కిసాన్ ధిండ్లే (18)గా గుర్తించారు.

32 ఏళ్ల హోటల్ వ్యాపారి నాందేడ్ సిటీ పోలీసులకు ముఠాపై ఫిర్యాదు చేశాడు. అతను Google Play Store నుండి Grindr యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. జనవరి 13న, అతనికి ఒక వ్యక్తి నుండి యాప్‌లో సందేశం వచ్చింది. వారు చాటింగ్ ప్రారంభించారు. సుదీర్ఘ సంభాషణ తర్వాత, ఇద్దరూ జనవరి 14న కలవాలని నిర్ణయించుకున్నారు. స్వలింగ సంపర్కుడిగా నటించిన భరత్ ధిండ్లే, రాత్రి 8 గంటల సమయంలో కలుసుకున్నారు. బాధితుడు సంఘటనా స్థలంలో ఉన్నప్పుడు, ప్రధాన నిందితుడు అతనిని తన బైక్‌పై కూర్చోబెట్టి ఓ పాఠశాల వెనుక ఉన్న ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే ముగ్గురు యువకులు వారిని కలిశారు. ధిండ్లే బాధితుడిని అసభ్యంగా తిట్టి, అతని వద్ద ఉన్న నగదు, బంగారు చెవిపోగులు, ఇతర విలువైన వస్తువులను దోచుకున్నాడు. బలవంతంగా బాధితుని ఫోన్‌పేని యాక్సెస్ చేసి రూ. 5,000 అతని ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది.

మొదట్లో, బాధితుడు భయం, సామాజిక కళంకం కారణంగా ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ దోపిడీల గురించి సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ కావడంతో పోలీసులకు బాధితుడు సమాచారం అందించాడు. ఆ తర్వాత పోలీసులు చేసిన ఆపరేషన్ లో నిందితులు అడ్డంగా దొరికిపోయారు. నిందితుడు, అతని సహచరులు స్వలింగ సంపర్కులు కాదు, కానీ వారు స్వలింగ సంపర్కులుగా నటించి Grindr యాప్‌లో చాట్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ధిండ్లే స్వలింగ సంపర్కులను ఆకర్షించి, బ్లాక్ మెయిల్ చేసి దోచుకునేవాడు. అతను బాధితులని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు, అక్కడ మరో ముగ్గురు యువకులు వారితో చేరి, బెదిరించి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకునేది. ఈ యాప్‌ను ఉపయోగించి నలుగురు స్వలింగ సంపర్కులను దోచుకున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

Next Story