అవయవ దానం చేసిన వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
అన్ని దానాలలో కంటే అవయవదానం గొప్పదని చెబుతూ ఉంటారు.
By Medi Samrat
అన్ని దానాలలో కంటే అవయవదానం గొప్పదని చెబుతూ ఉంటారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల అవయవాలతో ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపొచ్చు. మన దేశంలో అవయవ దానానికి సంబంధించి అవగాహన అంతంత మాత్రమే..! ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వం ఓ గొప్ప ఆలోచన చేసింది. ఇకపై అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.
అవయవదానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని.. దీంతో వందలాది మందికి మంచి జరిగిందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని స్టాలిన్ అన్నారు. అవయవ దానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ తమిళనాడు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇకపై అవయవదానం చేసిన వాళ్ల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు స్టాలిన్. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.