గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం..!
From no chief guest this year to parade timings and venue, here are all the details. జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం.
By Medi Samrat
జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త శకటాలు, సైన్యం చేతిలో ఉన్న ఆయుధాలను ప్రదర్శించి, వాటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చూపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరమూ లక్షలాది మంది ఈ వేడుకలను నేరుగా తిలకిస్తుండగా, ఈ సంవత్సరం మాత్రం కేవలం 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. సీఆర్పీఎఫ్ కమాండోల ఆధ్వర్యంలో జరిగే మోటార్ సైకిల్ విన్యాసాలు కూడా కనిపించవు.
ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా పరేడ్ లో భాగం కానున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఈ విమానాలు భారత వాయుసేనలో చేరాయి. భారత అమ్ముల పొదిలోకి వచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలను రిపబ్లిక్ డే నాడు ప్రదర్శనకు ఉంచనున్నారు. భారత ఎయిర్ ఫోర్స్ వీటిని ప్రదర్శనకు తీసుకుని రానుంది. ఈ యుద్ధ విమానాలను చూడాలని భారతీయులు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. రిపబ్లిక్ డే నాడు ఒక్క రాఫెల్ యుద్ధ విమానంతో 'వర్టికల్ ఛార్లీ' ఫార్మేషన్ ను చేయనున్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది తెలిపారు. ఒక రాఫెల్ యుద్ధ విమానం లీడ్ తీసుకుని రెండు జాగ్వార్, రెండు మిగ్-29 ఫైటర్లతో కలిసి ఏకలవ్య ఫార్మేషన్ ను చేసి చూపించనుంది.
ఇక తొలి మహిళా ఫైటర్ విమానాల పైలెట్ భావనా కాంత్ ఈ ప్రదర్శనలో భాగం పంచుకోనున్నారు. పలు రకాల తేలికపాటి యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్-30 జెట్లు కూడా కనువిందు చేయనున్నాయి. ఇక రిపబ్లిక్ వేడుకల్లో తొలిసారిగా లడ్డాఖ్ భాగం కాబోతోంది. లేహ్ లో భాగమైన థిక్సే కొండలపై ఓ పర్యాటక కేంద్రంగా ఉన్న చారిత్రక మఠం నమూనా తొలిసారిగా ప్రదర్శితం కాబోతుండగా, యూపీలో నిర్మితం కానున్న రామాలయం నమూనా, ఏపీకి సంబంధించి లేపాక్షీ థీమ్ తో శకటం ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. భారత నావికాదళం నుంచి 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నమూనా శకటం రానుంది.
మరో దేశం నుంచి ప్రత్యేక అతిథి లేకుండా రిపబ్లిక్ వేడుకలు జరగడం ఇది మూడోసారి. గతంలో 1952, 1953, 1956 సంవత్సరాల్లో గెస్ట్ లేకుండానే వేడుకలు జరిగాయి. ఈ సంవత్సరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, తాను వచ్చేందుకు అంగీకరించినా, బ్రిటన్ లో కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది. మీడియా ప్రతినిధుల సంఖ్యను 300 నుంచి 200కు తగ్గించారు. పరేడ్ లో విద్యార్థుల ప్రదర్శనలను రద్దు చేశారు. 15 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి అనుమతి లేదు.
రిపబ్లిక్ డే పెరేడ్ లో ఎన్నో విమానాలు కూడా విన్యాసాలు చేయనున్నాయి. 1971 యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన డకోటా విమానం కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పాకిస్థాన్ మీద భారత్ గెలిచి 50 సంవత్సరాలు పూర్తీ అయిన సందర్భంగా బంగ్లాదేశ్ మిలిటరీ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకోనుంది. డకోటా ఎయిర్ క్రాఫ్ట్.. రెండు ఎంఐ-17 1వి హెలికాఫ్టర్లతో కలిసి రుద్ర ఫార్మేషన్ ను చేయనున్నాయి.