బెంగాల్‌లో షష్ఠి నుండి దశమి(దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు) వరకూ ఖైదీలకు జైలు అధికారులు ప్రత్యేకమైన వంటలు వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే దుర్గాపూజకు సంబంధించి జైలు అధికారులు ఖైదీల కోసం ప్రత్యేక మెనూ చార్ట్‌ను సిద్ధం చేశారు.
వీటిలో బెంగాలీలలో ప్రసిద్ధి చెందిన మాచేర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర), మాచేర్ మాతా దియే దాల్ (చేప తలతో బెంగాలీ మూంగ్ దాల్), లూచి చోలార్ దాల్ (చనా పప్పుతో బెంగాలీ పూరీ), పాయెష్ (ఖీర్), చికెన్ కర్రీ, ఆలూ పోటోల్ చింగ్రీ (పర్వాల్ మరియు బంగాళదుంపలతో బెంగాలీ రొయ్యలు), రైతాతో మటన్ బిర్యానీ, బసంతి పులావ్ (జీడిపప్పులు, ఎండుద్రాక్ష, నెయ్యితో చేసిన పులావ్) లను పూజ సమయంలో ఖైదీలు తినేందుకు ప్రత్యేక మెనూగా ఇవ్వనున్నారు.
ఈ విషయమై బరాక్‌పూర్ సబ్ రిఫార్మేషన్ హోమ్ సీనియర్ జైలు అధికారి మాట్లాడుతూ.. జైలు ఒక సంస్కరణ నిలయం. ఖైదీలు పండుగలకు ముందు మాకు ప్రత్యేక ఆహారం కావాలని కోరుతూ లేఖ వ్రాస్తారు. మేము ఈ సంవత్సరం మెనూ ప్రక్రియ మెరుగుదలపై కూడా దృష్టి పెడుతున్నాము. ఈ ఖైదీల ముఖాల్లో చిరునవ్వు తేవాలన్నదే మా ప్రయత్నం. జైలు క్యాంటీన్‌లో కుక్‌లు, సహాయకులుగా పనిచేస్తున్న ఖైదీలు ఐదు రోజుల వేడుకలకు ఇవన్నీ సిద్ధం చేస్తారని బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ సీనియర్ జైలు అధికారి తెలిపారు.