ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) మెడికల్ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ చేశారు. అక్కడితోనే ఆగని ఆ సీనియర్లు (మూడవ సంవత్సరం విద్యార్థులు) లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా, దాడికి కూడా పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు సీనియర్లు తమతో బలవంతంగా అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డారని, అనుచితంగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసహజ శృంగారం సహా అసభ్యకర చర్యలకు సీనియర్లు తమను బలవంతం చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. అమ్మాయిలపై కూడా కించపరిచే వ్యాఖ్యలు చేయాలని కోరారు. UGC యాంటీ ర్యాగింగ్ యూనిట్ MGMMC డీన్‌కు ఫిర్యాదును తెలియజేసి, FIR నమోదు చేయమని కోరింది.
MGM మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ మాట్లాడుతూ.. "బాధితుడైన ఒక విద్యార్థి కొన్ని రోజుల క్రితం UGC యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసాడు. మెయిల్ అందిన వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను ఆమోదించారు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఒక లేఖ పంపాము" అని అన్నారు. ఈ ఘటనపై సంయోగిత గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తహజీబ్ ఖాజీ మాట్లాడుతూ.. ఎంజీఎం కాలేజీ ఫిర్యాదు మేరకు ర్యాగింగ్ కేసు నమోదు చేశామని.. 8 నుంచి 10 మంది విద్యార్థులపై ర్యాగింగ్ నిరోధక చట్టం సెక్షన్ 294, 323, 506 కింద కేసులు నమోదు చేశామన్నారు.