జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి బోల్తా పడడంతో నలుగురు సైనికులు తుదిశ్వాస విడిచారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పహారా కాసేందుకు వెళ్తున్న సైనిక వాహనం వులార్ వ్యూపాయింట్ వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలోనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. క్షతగాత్రులను బందిపొరా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు శ్రీనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ప్రమాద స్థలంలో భద్రతా బలగాలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. కొద్దిరోజుల క్రితం పూంఛ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గరోవా ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.