Breaking : యూపీలో పడవ ప్రమాదం.. 24 మంది గల్లంతు
భారత్-నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఉత్తర్రదేశ్ రాష్ట్రం సుజౌలి ప్రాంతంలోని భరతపూర్ గ్రామానికి చెందిన 28 మంది ప్రజలు బుధవారం ఖైరతియా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు పడవపై వెళ్లారు.
By - Medi Samrat |
భారత్-నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఉత్తర్రదేశ్ రాష్ట్రం సుజౌలి ప్రాంతంలోని భరతపూర్ గ్రామానికి చెందిన 28 మంది ప్రజలు బుధవారం ఖైరతియా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు పడవపై వెళ్లారు. తిరిగి వస్తుండగా కౌడియాల నదిలో ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో బోటు తడబడి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నది నుండి నలుగురిని సురక్షితంగా రక్షించారు. మిగతా 24 మంది గల్లంతైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎస్పీ, ఏడీఎం, ఎస్‌డీఎం మిహిన్‌పూర్వా, ఇతర పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో కలిసి ప్రమాద స్థలానికి చేరుకోవాలని పోలీసులు, పరిపాలన సిబ్బందిని ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు సజావుగా జరిగేలా చూడాలని ఉన్నతాధికారులను కోరారు.
ఇటీవల చౌదరి చరణ్ సింగ్ ఘఘ్రా బ్యారేజీ మూసివేత సమయం పూర్తయిన తర్వాత బ్యారేజీ గేట్లను తెరిచారు. దీంతో కౌడియాల, గెరువా నదుల్లో ఉధృతంగా నీటి ప్రవాహం వచ్చింది. బుధవారం భరతాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, రాణిదేవి, జ్యోతి, హరిమోహన్‌తోపాటు 28 మంది బోటు ఎక్కి ఖైర్తియాకు వెళ్లారు. ఈ పడవను పుట్టిలాల్ కుమారుడు మిహిన్‌లాల్ నడుపుతున్నాడు. లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అందరూ ఒకే పడవలో కౌడియాల నది మీదుగా భర్తాపూర్‌కు తిరిగి రావడం ప్రారంభించారు. కాలినడక దూరం ఎక్కువ కావడంతో అందరూ పడవ ప్రయాణం చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.
భర్తాపూర్ గ్రామం చేరుకునేలోపు నది ప్రవాహానికి పడవ బోల్తా పడిందని చెబుతున్నారు. దీంతో అక్కడికక్కడే తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న ప్రజలు హరిమోహన్, జ్యోతి, రాణి దేవి, లక్ష్మీనారాయణలను నది నుండి సురక్షితంగా రక్షించారు. కాని మరికొందరు నదిలో గల్లంతయ్యారు, వీరిని వెతకడానికి గిరిజాపురిలో ఉన్న చౌదరి చరణ్ సింగ్ ఘఘ్రా బ్యారేజీ గేటును మూసివేయడం ద్వారా నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే ఏడీఎం అమిత్‌కుమార్, ఎస్పీ రాంనాయన్‌సింగ్, ఇతర పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని డీఎం అక్షయ్ త్రిపాఠి తెలిపారు.