అయోధ్యలో మసీదు నిర్మాణం.. జనవరిలో శంకుస్థాపన
Foundation Ceremony Of Ayodhya Mosque. దశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి సుప్రీం కోర్టు
By Medi Samrat Published on 18 Dec 2020 4:56 AM GMTదశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఎండ్ కార్డు పడడంతో.. అయోధ్యలో బాబ్రీ మసీద్‌కు బదులుగా మరో మసీద్ నిర్మాణానికి పునాది రాయి పడనుంది. గణతంత్ర దినోత్సవం రోజున(జనవరి 26) న శంకుస్థాపన చేయనున్నారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌ను ఈ శనివారం రిలీజ్ చేయనున్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది.
అయోధ్యలోని దన్నీపూర్ గ్రామంలో మసీదు కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థలంలో మసీదు నిర్మాణాన్ని చేపడుతున్నారు. మసీదు కాంప్లెక్స్‌కు చెందిన బ్లూ ప్రింట్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీలు ఉన్నాయి. ఈ ప్లాన్‌కు చీఫ్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ ఆమోదం తెలిపినట్లు ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. మసీదును రౌండ్ షేప్‌లో నిర్మించనున్నామని.. ఒకేసారి అక్కడ సుమారు రెండు వేల మంది ప్రార్థనలు చేసే విధంగా నిర్మిస్తామన్నారు. కొత్త మసీదు.. బాబ్రీ మసీదు కన్నా పెద్దగా ఉంటుందని..ఆ కాంప్లెక్స్ సెంటర్‌లో హాస్పిటల్‌ను నిర్మిస్తామని, మహామ్మద్ ప్రవక్త బోధించిన విధంగానే మానవ సహాయం చేయనున్నట్లు అకర్త్ తెలిపారు. 300 పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నట్లు వెల్లడించారు.