ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్ లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం నిర్వహించిన తర్వాత అధికారికంగా హిందూ మతంలోకి మారారు వసీం రిజ్వీ. ఆచారంలో భాగంగా దాస్నా దేవి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి పాలు సమర్పించారు రిజ్వీ. హిందూ మతంలోకి మారిన నేపథ్యంలో ఆయన పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చుకున్నారు. ఈ రోజు నేను సనాతన ధర్మాన్ని అంగీకరిస్తున్నాను అని తెలిపారు. 1992లో ఇదే రోజున బాబ్రీ మసీదు కూల్చివేయబడినందున హిందూ మతంలోకి మారడానికి ఇదే డిసెంబర్ 6 పవిత్రమైన రోజుని నేను ఎంచుకున్నానన్నారు. తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నారు.
తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింగానంద్ సరస్వతి నిప్పంటించాలని రిజ్వీ తెలిపారు. గత నెల 4వ తేదీన వసీం రిజ్వీ ఘజియాబాద్ లోని దస్నా దేవీ ఆలయంలో నరసింగానంద్ సరస్వతి సమక్షంలో విడుదల చేసిన ఓ బుక్ పై ముస్లింలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆ బుక్ కవర్ పేజీపై అర్థనగ్నంగా ఉన్న మహిళతో ఓ వ్యక్తి ఉన్న చిత్రం ఉండటంపై చాలా మంది ముస్లిం పెద్దలు,ఆల్ ఇండియా షియా లా బోర్డ్ సహా పలు ముస్లిం ఆర్గనైజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వసీం రిజ్వీ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నవంబర్ 17న తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.