విషాదం..కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
By - Knakam Karthik |
విషాదం..కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా సురేశ్ కల్మాడికి భార్య, ఒక వివాహిత కుమారుడు, కోడలు, ఇద్దరు వివాహిత కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఆయన భౌతికకాయం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పుణెలోని ఎరండవణే ప్రాంతంలోని కల్మాడి హౌస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవి పేఠ్‌లోని వైకుంఠ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
కల్మాడీ రాజకీయ నేపథ్యం..
సురేశ్ కల్మాడి రాజకీయాలతో పాటు క్రీడా పరిపాలన రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయన, కేంద్ర రైల్వే శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు, భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకారం, కల్మాడీ తొలిసారిగా 1980లో కాంగ్రెస్ (ఎస్) ఎంపీగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1986లో రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. మూడోసారి, 1992లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కల్మాడీ తొలిసారి 1996లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు, ఆ తర్వాత 2004 మరియు 2009లో కూడా ఎన్నికయ్యారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో పూణే వికాస్ అఘాడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు, ఆయనకు బిజెపి, శివసేన మద్దతు ఇచ్చాయి. 2011లో CWC కుంభకోణం తర్వాత కల్మాడిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. "కుంభకోణానికి సంబంధించిన చాలా కేసుల్లో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఒకే ఒక కేసు పెండింగ్‌లో ఉంది" అని కాంగ్రెస్ నగర ప్రతినిధి రమేష్ అయ్యర్ అన్నారు. పూణే నగర అభివృద్ధిలో సురేష్ కల్మాడీ ప్రధానంగా కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పేర్కొంది.