సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ మాధవ్ గాడ్‌బోలే సోమవారం తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మాధవ్ గాడ్‌బోలే వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు. డాక్టర్ గాడ్‌బోలేకు భార్య సుజాత, కుమారుడు రాహుల్, కోడలు దక్షిణ, కుమార్తె మీరా, అల్లుడు మహేష్, మనవరాళ్లు ఉన్నారు.
డా. గాడ్‌బోలే ముంబయి విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్‌లో మాస్టర్స్, ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసారు. ఆ తర్వాత యూఎస్‌లోని మసాచుసెట్స్‌లోని విలియమ్స్ కాలేజీ నుండి డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో ఎంఏ చేసారు. గాడ్‌బోలే మార్చి 1993లో కేంద్ర హోం కార్యదర్శిగా ఉన్నప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన రచయితగా దాదాపు 22 పుస్తకాలు రచించారు. గాడ్‌బోలే సుదీర్ఘ బ్యూరోక్రాటిక్ కెరీర్‌లో.. మహారాష్ట్రలోని ఎన్రాన్ పవర్ ప్రాజెక్ట్, భారతదేశ అంతర్జాతీయ సరిహద్దుల నిర్వహణతో సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ కమిటీలకు అధ్యక్షత వహించారు.
గాడ్‌బోలే మహారాష్ట్ర ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ గా, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సెక్రటరీగా, అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా కీలక పదవులలో పనిచేశారు. అంతేకాకుండా ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో ఐదేళ్లు పనిచేశారు.