జ్వరం, బలహీనతతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 13న ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్ వైద్యుల పరిశీలనలో ఉండి కోలుకుని ఆదివారం సాయంత్రం 5:20 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు. ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో టవర్‌లోని ప్రైవేట్ వార్డులో చికిత్స పొందిన ఆయన కోలుకున్నారు. డాక్టర్ నితీష్ నాయక్ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం మన్మోహన్ సింగ్ కు చికిత్స అందించింది.
ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో సహా పలువురు నాయకులు ఎయిమ్స్‌లో మన్మోహన్ ను పరామర్శించారు. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ప్రభుత్వ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు.