మాజీ సీఎం హేమానంద బిస్వాల్ క‌న్నుమూత‌

Former Odisha CM Hemananda Biswal Passes Away At 83. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఒడిశా మాజీ సీఎం హేమానంద బిస్వాల్ క‌న్నుమూశారు.

By Medi Samrat  Published on  26 Feb 2022 1:15 AM GMT
మాజీ సీఎం హేమానంద బిస్వాల్ క‌న్నుమూత‌

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఒడిశా మాజీ సీఎం హేమానంద బిస్వాల్ క‌న్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయ‌న‌ తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు హేమానంద బిస్వాల్ మ‌ర‌ణ‌వార్త‌ను ఆయన కుమార్తె సునీతా బిస్వాల్‌ తెలిపారు. ప్ర‌స్తుతం హేమానంద బిస్వాల్ వయసు 83 సంవ‌త్స‌రాలు. హేమానంద బిస్వాల్ ఒడిశా ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నిక‌య్యారు. బిస్వాల్ డిసెంబర్ 7, 1989 నుంచి మార్చి 5, 1990 వరకు మొద‌టి సారి సీఎం కుర్చీని అధిరోహించ‌గా.. డిసెంబర్ 6, 1999 నుంచి మార్చి 5, 2000 వరకు రెండ‌వసారి ముఖ్య‌మంత్రిగా పనిచేశారు.

బిస్వాల్ ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రిగా ఖ్యాతి గ‌డించారు. సుందర్‌ఘర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన బిస్వాల్ వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. తొలిసారిగా 1974లో ఎమ్మెల్యేగా.. 2009-14లో సుందర్‌గఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1939 డిసెంబరు 1న జార్సుగూడలోని ఠాకూర్‌పాడ గ్రామంలో జన్మించిన బిస్వాల్‌ సమర్థుడైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1998, 99 మధ్య బిస్వాల్‌ ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా నియమితులయ్యారు. బిస్వాల్‌ జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. బిస్వాల్ మృతి పట్ల ప‌లువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న‌ మృతి ఒడిశా రాజకీయాలకు తీరని లోటని అన్నారు.


Next Story