మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్.. ఈ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురై జైల్లో కుప్పకూలారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది నవంబర్ 2న అరెస్టయ్యారు. ఆయన కుప్పకూలిపోవడంతో ఆర్థూర్ జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన ముంబైలోని జేజే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స చేయిస్తున్నారు. అనిల్ దేశ్‌ముఖ్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారని, ఛాతిలో నొప్పిగా ఉందని చెబుతూ కుప్పకూలి పోయారని జైలు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు చెప్పారు. రక్తపోటు అధికంగా ఉందని.. చాతిలో నొప్పిగా ఉందని చెబుతుండటంతో అవసరమైన వైద్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. 72 ఏండ్ల అనిల్ దేశ్‌ముఖ్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 2021, నవంబర్ 2న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ప్రస్తుతం తన పర్సనల్ సెక్రెటరీ సంజీవ్ పలాండే, పర్సనల్ అసిస్టెంట్ కుందన్ షిండేతో కలిసి ఆర్థూర్ జైల్లో ఉన్నారు. దేశ్‌ముఖ్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కూడా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దేశ్‌ముఖ్ ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఆసుపత్రికి తరలించామని జైళ్ల అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ రామానంద్ చెప్పారు.