ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ ఎన్నికల్లో పోల్ ద్వారానే భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ లోనూ ఆప్ పోల్ సంప్రదాయాన్నే కొనసాగించింది. గుజరాత్ లో తన సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గాధ్విని ప్రకటించింది. తమ పార్టీ తరఫున ఎవరు సీఎం అభ్యర్థిగా ఉండాలో నిర్ణయించాలంటూ గుజరాత్ ప్రజలను ఆప్ కోరింది. పోల్ లో వచ్చిన ఫలితాల మేరకే ఇసుదాన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గాధ్వి పేరును అధికారికంగా ప్రకటించారు.
రాజకీయ నేతగా మారక ముందు ఇసుదాన్ గాధ్వి జర్నలిస్టుగా పని చేశారు. వీటీవీ గుజరాతికి ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన వీటివీ న్యూస్ కూ ఎడిటర్ గా పని చేశారు. ఆప్ ప్రారంభం తర్వాత జర్నలిజానికి స్వస్తి చెప్పిన గాధ్వి, రాజకీయాల్లోకి వచ్చారు. మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదాన్ గాధ్వి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై AAP సర్వేలో 73 శాతం ఓట్లు సాధించారు. ఆప్ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా రేసులో ఉన్నారు. ఇటాలియా గత సంవత్సరం గాధ్వీని సంప్రదించి, రాజకీయాల్లోకి ఆయనను రమ్మని పిలిచారు.