రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులను బెదిరించినందుకు ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్జల్ అనే వ్యక్తి ఈ ఉదయం ముంబైలోని గిర్గావ్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు మూడు-నాలుగు బెదిరింపు కాల్స్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు కాల్ చేసిన ఫోన్ నంబర్‌ను గుర్తించిన పోలీసులు ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో.. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నాడని మీడియా సంస్థలు తెలిపాయి. కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందించిన భద్రతను కొనసాగించవచ్చని గత నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఈ నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. అంబానీలకు ప్రభుత్వ భద్రత కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ త్రిపుర హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) స్వీకరించడంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంబానీ, అతని కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. గతేడాది ముకేశ్ అంబానీ ఇంటి ముందు ఓ వాహనం సృష్టించిన కలకలం అంతా ఇంతాకాదు.