బిపార్జోయ్ తుఫాను.. ఆ మూడు జిల్లాల‌కు పొంచి ఉన్న ప్ర‌మాదం

Flood-Like Situation in Rajasthan's Jalore, Sirohi and Barmer Districts. బిపార్జోయ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజస్థాన్‌లోని మూడు జిల్లాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2023 12:23 PM GMT
బిపార్జోయ్ తుఫాను.. ఆ మూడు జిల్లాల‌కు పొంచి ఉన్న ప్ర‌మాదం

బిపార్జోయ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజస్థాన్‌లోని మూడు జిల్లాలు - జలోర్, సిరోహి, బార్మెర్.. లలో వరదల ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలిపారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంతో ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. బిపార్జోయ్ తుఫాను సమయంలో ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉందని.. ఆ పరిస్థితులను ఎదుర్కోడానికి సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. పాలి జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ఆరుగురిని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (SDRF) రక్షించింది. భారీ వర్షాల కారణంగా జలోర్, సిరోహి, బార్మెర్‌లలో వరదల లాంటి పరిస్థితి ఉందని రాష్ట్ర విపత్తు, సహాయ కార్యదర్శి పిసి కిషన్ తెలిపారు. ప్రాణనష్టం, పశువులు మరణించినట్లు ఇప్పటివరకు నివేదించబడలేదని.. మా బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.

భారీ నీటి ప్రవాహం కారణంగా బార్మర్‌లో నాలుగు-ఐదు చిన్న ఆనకట్టలు దెబ్బతిన్నాయని.. పిండ్వారా, అబు రోడ్, రియోదర్‌లలో అనేక పెద్ద ఆనకట్టలు పొంగిపొర్లుతున్నాయని అధికారి తెలిపారు. సిరోహిలోని బతిసా డ్యామ్‌లో నీటిమట్టం 315 మీటర్లకు పెరిగిందని తెలిపారు. రానున్న 15-20 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కిషన్‌ తెలిపారు.

డిజాస్టర్ రిలీఫ్ అండ్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. జలోర్‌లోని అహోర్‌లో 471 మిమీ, జలోర్‌లో 456 మిమీ, మౌంట్ అబూలో 360 మిమీ, చితల్వానాలో 338 మిమీ, జస్వంత్‌పురాలో 332 మిమీ, రాణివాడలో 322 మిమీ, షియోగంజ్‌లో 315 మిమీ, సుమేర్‌పూర్‌లో 270 మిమీ, రాణి 249 మిమీ వర్షం నమోదైంది. ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు బాలిలో 240 మి.మీ. వర్షపాతం నమోదైంది. జలోర్, సిరోహి, బార్మర్, పాలిలోని అనేక ఇతర ప్రదేశాలలో ఈ సమయంలో 25 మిమీ, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ ప్రకారం, దక్షిణ రాజస్థాన్ పరిసరాల్లోని మధ్య ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం కనిపించింది. ఉదయం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు-ఈశాన్య దిశగా కదిలింది. తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో అల్పపీడనం తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం పాలీ, సిరోహి, ఉదయ్‌పూర్, రాజాసమంద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

జోధ్‌పూర్, అజ్మీర్, జైపూర్, కోటా డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి రాజస్థాన్‌లోని నైరుతి ప్రాంతాలలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో (జూన్ 19 ఉదయం 5.30 గంటల వరకు) తూర్పు, పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరదల ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


Next Story