219 మందితో ముంబై చేరుకున్న తొలి విమానం
Flight with 219 Indians from Ukraine reaches Mumbai. యుద్ధ వాతావరణం నెలకొన్న దేశం ఉక్రెయిన్ నుంచి రోమానియాకు చేరుకున్న 219 మంది భారతీయ విద్యార్ధులు
By Medi Samrat Published on 26 Feb 2022 9:29 PM ISTయుద్ధ వాతావరణం నెలకొన్న దేశం ఉక్రెయిన్ నుంచి రోమానియాకు చేరుకున్న 219 మంది భారతీయ విద్యార్ధులు.. అక్కడి నుంచి ఎయిరిండియా విమానం ద్వారా బయలుదేరి శనివారం సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. రోమానియా రాజధాని బుకారెస్ట్ నుండి విద్యార్ధులతో బయలుదేరిన విమానం రాత్రి 7.50 గంటలకు ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. విద్యార్ధులకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. "ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని తిరిగి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. 219 మంది విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు. ఇది మొదటి బ్యాచ్ కాగా, రెండో బ్యాచ్ త్వరలో ఢిల్లీకి చేరుకుంటుంది. అందరూ ఇంటికి తిరిగి వచ్చే వరకు మేము ఆగము" అని అన్నారు.
ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ కూడా విద్యార్ధులకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. "నేను ముంబై ప్రథమ పౌరురాలిగా విమానాశ్రయానికి వచ్చాను. ముంబైలో ల్యాండ్ అయ్యే పౌరులు, విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరైనా బస చేయాలనుకుంటే.. ఏర్పాట్లు చేసాము. కోవిడ్ జాగ్రత్తల నేఫథ్యంలో పరీక్షలు చేయడం, టీకాలు కూడా వేయబడతాయని తెలిపారు.
ఉక్రెయిన్ నుండి భారత పౌరులను తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తి ప్రయత్నం చేస్తోంది. దాదాపు 20,000 మంది పౌరులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మిషన్‌కు ఆపరేషన్ గంగా అని నామకరణం చేసినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. విద్యార్ధులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్‌ను విదేశాంగ మంత్రి జైశంకర్ ట్యాగ్ చేశారు. పీయూష్ గోయల్ ట్వీట్‌లో "ఉక్రెయిన్ నుండి సురక్షితంగా తరలించబడిన భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఆనందంగా ఉంది. ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రతి భారతీయుడి భద్రత కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని రాశారు.