అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణ, ప్రాముఖ్యతలు ఇవే
అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంగా, నేడు మధ్యాహ్నం జరగనున్న ధ్వజారోహణ మహోత్సవానికి నగరం సిద్ధమైంది.
By - Knakam Karthik |
అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణ, ప్రాముఖ్యతలు ఇవే
అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంగా, నేడు మధ్యాహ్నం జరగనున్న ధ్వజారోహణ మహోత్సవానికి నగరం సిద్ధమైంది. ఈ పుణ్యకార్యాన్ని అభిజీత్ ముహూర్తంలో నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆలయం ప్రధాన శిఖరంపై కేశర కంభాన్ని అధికారికంగా ఎగురవేస్తారు.
161 అడుగుల ఎత్తైన శిఖరంపై 42 అడుగుల ధ్వజస్తంభానికి ఎగురబోయే ఈ పతాకం 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. కార్యక్రమానికి 6,000 నుంచి 8,000 వరకు ఆహ్వానితులు హాజరుకానున్నారు. నిషాద్ సమాజం, శబరి మాతను సూచించే వర్గాల ప్రతినిధులు వంటి ఇప్పటివరకు ఆహ్వానించబడని అనేక వర్గాలకు ఈ సారి ప్రత్యేక ఆహ్వానం వెళ్లింది. మొత్తం నగరాన్ని అలంకరించేందుకు దాదాపు 100 టన్నుల పూలను వినియోగించారు. పతాకారోహణ అనంతరం ప్రత్యేక హారతి నిర్వహిస్తారు.
ధ్వజారోహణ ప్రాముఖ్యత – ఐదు ముఖ్యాంశాలు
1. ధ్వజారోహణ ఎందుకు ముఖ్యమైంది?
•రామ్మందిరం నిర్మాణం పూర్తయిందని అధికారికంగా ప్రకటించే ఆధ్యాత్మిక కార్యక్రమం ఇదే.
•నిర్మాణ స్థితి ముగిసి, ఆలయం సంపూర్ణ దైవిక స్థానంగా మారిన క్షణాన్ని ఇది సూచిస్తుంది.
•దీని ద్వారా దేవస్థానం “ఆధ్యాత్మికంగా సజీవం” అయినట్టు పండితులు అభిప్రాయపడుతున్నారు.
2. మోదీ ఎగురబోయే పతాకంపై ఏముంది?
•కేశర రంగు పతాకంపై బంగారు నూలుతో మూడు పవిత్ర చిహ్నాలు అల్లబడ్డాయి:
•సూర్యుడు – శ్రీరాముడు సూర్యవంశ వంశస్థుడని సూచన
•ఓం – శాశ్వత ఆధ్యాత్మిక శబ్దం
•కోవిదార వృక్షం – పవిత్రత, సౌభాగ్యం, రామరాజ్యం ప్రతీక
•కోవిదార వృక్షం మందార–పారిజాతాల సంయోగంగా ఋషి కశ్యపుడు సృష్టించాడని వాల్మీకి రామాయణం పేర్కొంటుంది. ఇది పురాతన కాలంలో మొక్కల సంశ్లేషణ జ్ఞానాన్ని చూపిస్తుంది.
3. ధ్వజారోహణ – ప్రాణ ప్రతిష్ఠ నుండి ఎలా భిన్నం?
•ప్రాణ ప్రతిష్ఠ (22 జనవరి 2024): రామలల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు ప్రారంభించిన సందర్భం.
•ధ్వజారోహణ: ఆలయ నిర్మాణ సంపూర్ణతకు చిహ్నం. ఆలయం మొత్తాన్ని ప్రజలకు, సంప్రదాయాలకు పూర్తిగా అంకితం చేస్తున్న ఘట్టం.
•కొంతమంది పండితులు దీనిని “రెండో ప్రాణ ప్రతిష్ఠ”గా కూడా భావిస్తున్నారు.
•ఇదితో ఆలయానికి చెందిన 44 తలుపులన్నీ ఆరాధన, కార్యక్రమాల కోసం తెరవబడతాయి.
4. ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏమిటి?
• నేడు వివాహ పంచమి, శ్రీరామ–సీతల వివాహ దినం.
• అదే సమయంలో అభిజీత్ ముహూర్తం (ఉ. 11:58 – మ. 1:00) కుదిరింది, ఇది అత్యంత శుభ సమయం.
• పూర్తిగా నిర్మితమైన రామమందిరంలో జరిగే మొదటి రామ–సీత వివాహోత్సవం ఇదే.
5. అయోధ్య రామాలయం పతాకాన్ని ఎవరు తయారు చేశారు?
• గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ప్రత్యేక పారాచూట్ తయారీ సంస్థ 25 రోజులు పని చేసి ఈ పతాకాన్ని రూపొందించింది.
• బలమైన పారాచూట్-గ్రేడ్ వస్త్రం, ప్రీమియం పట్టు దారాలతో దీన్ని తయారు చేశారు.
• వర్షం, ఎండ, గాలులకు తట్టుకునేలా, 60 కి.మీ వేగం గాలులను కూడా ఎదుర్కొనేలా డిజైన్ చేశారు.
• సేనాధికారులతో సంప్రదించి స్పెసిఫికేషన్లు ఖరారు చేశారు.
• 42 అడుగుల త్రిప్పుకొనే ధ్వజస్తంభంపై నైలాన్ తాడు, ఆటోమేటిక్ హోయిస్టింగ్ సిస్టమ్‌తో ఇది అమర్చబడింది.