శుక్రవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒక అధికారితో సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కంది గ్రామంలోని కేసరి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో రాజౌరీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆర్మీ PRO లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. భద్రతా దళాల ఉమ్మడి ఆపరేషన్‌లో భాగంగా కోట్రాంక సబ్-డివిజన్‌లో ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.. ఉదయం 8 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని తెలిపారు.
రాజౌరీ సెక్టార్‌లోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం రావడంతో.. మే 3న సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు, ఒక గుహ లాంటి చోట ఉగ్రవాదుల బృందం ఉందని తెలిసింది. దళాల ఉమ్మడి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడే దాక్కున్న ఉగ్రవాదులు భారత సైన్యంపై కాల్పులు జరిపారు. దీంతో సైన్యం వారిని మట్టుబెట్టే పనిలో ఉన్నారు. క్షతగాత్రులను ఉదంపూర్‌లోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.