నేటి నుంచి 18వ లోక్‌సభ తొలి సమావేశాలు.. ప్ర‌ధాని స‌హా మొదటి రోజు 280 మంది సభ్యుల ప్ర‌మాణం

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది జూలై 3 వరకు కొనసాగుతుంది.

By Medi Samrat  Published on  24 Jun 2024 3:42 AM GMT
నేటి నుంచి 18వ లోక్‌సభ తొలి సమావేశాలు.. ప్ర‌ధాని స‌హా మొదటి రోజు 280 మంది సభ్యుల ప్ర‌మాణం

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది జూలై 3 వరకు కొనసాగుతుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన‌ సీనియర్ సభ్యుడు భర్తిహరి మహతాబ్.. కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల‌చే ప్రమాణం చేయిస్తారు. అయితే దీనికి ముందు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు.

ప్రొటెం స్పీకర్‌గా అధికార పక్షానికి చెందిన సభ్యుడిని నియమించడంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ఈ బాధ్యతను అప్పగించాల్సిన సీనియర్‌ సభ్యులు సభలో ఎక్కువ మంది ఉన్నారనే వాద‌న‌ను వినిపిస్తున్నాయి. దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ తొలి లోక్‌సభ సమావేశాల్లో జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జూన్ 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. జూలై 2 లేదా 3న చర్చపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఉంటుంది.

లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకారం.. 18వ లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంతో సోమవారం నుండి సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ ముందుగా ప్రధాని మోదీతో సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సభాపతి అసోసియేట్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. అనంతరం మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొదటి రోజు 280 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. రెండో రోజు మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రాల వారీగా పేరు ఆధారంగా ప్రమాణం చేయిస్తారు. అంటే ఏ తో మొదలయ్యే రాష్ట్రాల ఎంపీలు ముందుగా ప్రమాణం చేయిస్తారు.

18వ లోక్‌సభ సభ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌నుంది. ఇప్పటి వరకు సభలో కొన్ని సీట్ల‌కే పరిమితమైన ప్రతిపక్షం.. బలమైన స్థితిలో కనిపించనుంది. ఈసారి ప్రతిపక్ష స‌భ్యుల‌ సంఖ్య 234. వీరిలో 99 మంది సభ్యులు ఒక్క కాంగ్రెస్‌కు చెందినవారే. సభలో అధికార పక్షం బలం 293 కాగా.. అందులో బీజేపీకి మాత్రమే 240 మంది సభ్యులు ఉన్నారు. దీంతో నీట్ పరీక్షలో అవకతవకలు, అగ్నివీర్‌, ప్రొటెం స్పీకర్ ఎంపిక‌ వంటి అంశాల్లో సెషన్‌కు ముందు ప్రతిపక్షాలు దూకుడు వైఖరిని ప్రదర్శించడానికి ఇదీ ఓ కార‌ణం.

Next Story