Bihar Elections : 71 మందితో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో సీట్ల పంపకాలపై జరుగుతున్న పోరు నడుమ భారతీయ జనతా పార్టీ 71 స్థానాలకు గానూ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
By - Medi Samrat |
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో సీట్ల పంపకాలపై జరుగుతున్న పోరు నడుమ భారతీయ జనతా పార్టీ 71 స్థానాలకు గానూ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 9 మంది మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. వీరిలో పరిహార్ నుండి గాయత్రీ దేవి, నర్పత్‌గంజ్ నుండి దేవంతి యాదవ్, కిషన్‌గంజ్ నుండి స్వీటీ సింగ్, ప్రాణ్‌పూర్ నుండి నిషా సింగ్, కోధా నుండి కవితా దేవి, ఔరై నుండి రమా నిషాద్, వార్సాలిగంజ్ నుండి అరుణా దేవి, జముయి నుండి శ్రేయసి సింగ్ ఉన్నారు.
ఈసారి బీజేపీ అగ్ర నాయకత్వం కుమ్రార్, పాట్నా సాహిబ్, దానాపూర్ అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. కుమ్రార్ ఎమ్మెల్యే అరుణ్ సిన్హా స్థానంలో సంజయ్ గుప్తా, పాట్నా సాహిబ్ నుంచి నంద్ కిషోర్ యాదవ్ స్థానంలో రత్నేష్ కుష్వాహా, దానాపూర్ నుంచి మాజీ ఎంపీ రాంకృపాల్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు.
సీనియర్ నాయకులైన ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి, మంత్రి మంగళ్ పాండే, ప్రేమ్ కుమార్, కృష్ణ కుమార్ రిషి, నితిన్ నవీన్, సీనియర్ నాయకుడు రాంనారాయణ మండల్‌లు టిక్కెట్లు దక్కించుకున్నారు. సామ్రాట్ చౌదరి, మంగళ్ పాండే శాసన మండలి సభ్యులు కాగా, ఈసారి వారిని ఎన్నికల రంగంలో దింపాలని బీజేపీ ఆదేశించింది. తారాపూర్ అసెంబ్లీ నుంచి సామ్రాట్ చౌదరికి, శివన్ నుంచి మంగళ్ పాండేకు టికెట్ ఇచ్చారు.
టిక్కెట్ రద్దుపై, అవుట్గోయింగ్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్ మాట్లాడుతూ.. నేను భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. పార్టీ నాకు చాలా ఇచ్చింది. పార్టీపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. కొత్త తరానికి స్వాగతం, అభినందనలు. పాట్నా సాహిబ్ శాసనసభ ప్రజలు నన్ను వరుసగా ఏడుసార్లు గెలిపించారు. బీజేపీ అభ్యర్థిగా వారు నాపై చూపిన ఆప్యాయత, ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.