Video : టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  28 Sept 2024 12:53 PM IST
Video : టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చాలా తీవ్రంగా చెల‌రేగాయి. దీని కారణంగా ప్లాంట్‌లో పేలుడు సంభవించినట్లు స‌మాచారం. ఈ కారణంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్లాంట్‌లోని ప‌రిక‌రాల తయారీ విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్‌లోని ఉద్యోగులందరినీ సురక్షితంగా బ‌య‌ట‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంటల కారణంగా ప్లాంట్‌కు భారీ నష్టం వాటిల్లింది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్‌ నుంచి పొగలు కక్కుతూ దృశ్యాలు కనిపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. కంపెనీకి చెందిన గోదాములో మంటలు చెలరేగాయి, అది క్రమంగా ప్లాంట్‌లోని ఇతర భాగాలకు వ్యాపించింది.

ఘటన జరిగిన సమయంలో ప్లాంట్‌లో దాదాపు 1500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. టాటా ఎలక్ట్రానిక్స్ కూడా హోసూర్‌లోని తమ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌లు పాటించామని.. ఉద్యోగులందరికీ భద్రత కల్పించామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామ‌ని.. అగ్నిప్రమాదం కారణంగా ముగ్గురు ఉద్యోగులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్ల‌డించారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.


Next Story