బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి తండ్రిపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పై రాయ్‌పూర్‌లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని అక్కడి ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. నంద్ కుమార్ బాఘేల్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(B) కింద కేసు నమోదు చేసినట్లు రాయ్‌పూర్ పోలీసులు తెలిపారు.
బ్రాహ్మణులను విదేశీయులు అని.. వారిని బహిష్కరించాలని నంద్ కుమార్ బాఘేల్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారని, వారిని తమ గ్రామాలలోకి అనుమతించవద్దని ప్రజలను కోరినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సంస్థ తన ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ బాఘేల్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. సీఎం తండ్రి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయని పోలీసులకు తెలిపింది. తక్షణమే ఆయనపై చర్చలు తీసుకోవాలని కోరింది.